[spt-posts-ticker]

ప్రభుత్వ ఆసుపత్రి కాన్పులను ప్రోత్సహించాలి!

గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రత్యేక పర్యవేక్షణ

మన్యంలో వైద్య సేవలను మెరుగుపర్చేందుకు చర్యలు

భద్రాచలం:మాతా శిశు మరణాలను తగ్గించాలి. తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాలలో ఇవే ప్రధానమైనవి. ఇదే ఇప్పుడు భద్రాచలం మన్యం వైద్య ఆరోగ్య శాఖ ముందున్న ప్రధాన ప్రణాళిక. ఐటీడీఏ పీవో గౌతమ్‌ ఇటీవల వైద్య విభాగంతో సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశ నిర్దేశం చేయడంతో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. కాన్పు సమయంలో ప్రతీ గర్భిణి ఆసుపత్రిలో చేరేలా స్థానికంగా ఉండే ఆశా కార్యకర్తలతో పాటు ఏఎన్‌ఎంలు కృషి చేయాల్సి ఉంది. నమోదైన వారిలో కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కేసీఆర్‌ కిట్‌లతో పాటు ప్రభుత్వం పలు పథకాలను అందిస్తున్నప్పటికీ సర్కారు దవాఖానా వైపు కాకుండా ప్రైవేటుకు ఎందుకు వెళ్తున్నారన్నది గుర్తించే పనిలో పడ్డారు. దీనిపై స్పష్టమైన నివేదికలను ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 2019 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17,370 మంది గర్భిణులను 29 పీహెచ్‌సీల పరిధిలో నమోదు చేయాల్సి ఉండగా 15,248 మందిని నమోదు చేశారు. ఇందులో 11,328 కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యాయి. మిగతావి పుట్టింటి వద్దగానీ ప్రైవేటు ఆసుపత్రిలో గానీ అయి ఉంటాయి. ఇలా 20 నుంచి 25 శాతం కాన్పులు వేర్వేరు చోట్ల అవుతున్నాయని అంచనా. వీటిలో ఎక్కువ శాతం ప్రైవేటుకు వెళ్తుండటం వల్ల ఆ కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుంది. ఇలా ఎందుకు అవుతుందో తెలుసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తద్వార సేవల్లో లోపాలను సరి చేసుకోవడంతో పాటు సర్కారు వైద్యం అండగా ఉందనే భరోసాను కల్పించనున్నారు.

 

అనారోగ్యానికి ఎన్నో కారణాలు

గర్భిణులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డ బాగుంటుంది. ఇందుకోసం క్రమ పద్ధతిలో వైద్య పరీక్షలను చేపించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి నిరోధక టీకాల పట్ల చైతన్యం కావాలి. మన్యంలో ప్రధానంగా పట్టి పీడిస్తున్న ఇబ్బంది పోషకాహార లోపం. అంగన్‌వాడీ కేంద్రాలలో అందించే ఆహారాన్ని వాడడం వల్ల ప్రయోజనం ఉంటుందని వైద్యులు అంటున్నారు. రక్త హీనత తలెత్తకుండా చూసుకోవాలి. చిన్న వయస్సులో కాన్పులు, కాన్పుల మధ్య ఎడం లేకపోవడం, అబార్షన్‌ కావడం, హైబీపీ వంటి లక్షణాలు ఉన్న వాళ్లు వైద్యుల సూచనలు పాటించాలని చెబుతున్నారు. ఇంటి వద్ద కాన్పులకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మాతృ మరణాల రేటు 88 ఉండగా భద్రాచలం మన్యంలో ఇది 100కి పైగా ఉండటం సర్వత్రా ఆందోళన కలిగించే అంశం. శిశు మరణాల రేటు విషయంలో మన దగ్గర మెరుగైన పని తీరే కనబరుస్తున్నారు. ఆరుగురు వైద్యులు, 43 ఏఎన్‌ఎం, 35 హెల్త్‌ అసిస్టెంట్‌, 5 ఫార్మాసిస్టు పోస్టులు ఖాళీగా ఉండడం వైద్య సేవలకు ఇబ్బందిగా మారింది. భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది. ఒకప్పుడు ఇది కాన్పుల విషయంలో రికార్డులను స్థాపించగా ప్రస్తుతం కొన్ని కేసులను రిఫరల్‌ చేయాల్సి వస్తోంది.

గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ

డా.వెంకటేశ్వర్లు, అడిషనల్‌ డీఎంహెచ్‌వో

మన్యంలో గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ పెంచుతున్నాం. ఇమ్యూనైజేషన్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. సురక్షిత కాన్పులపై అవగాహన కల్పించడంతో పాటు ఆసుపత్రిలో చేరేలా స్థానికంగా పని చేసే సిబ్బంది చొరవ తీసుకోవాలని ఆదేశించాం. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే సేవల గురించి వివరించి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా సిబ్బంది చొరవ తీసుకుంటున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *