[spt-posts-ticker]

ఫార్మసిస్ట్ లే ప్రాధమ్య ఆరోగ్య నిపుణులు!

  • జాతీయ ఫార్మసీ వారోత్సవాలు 16-22 నవంబర్ 2020
  • వ్యాసకర్త డాక్టర్ రాపోలు సత్యనారాయణ

హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): కొవిడ్ 19 సంక్షోభం నుంచి గట్టెక్కటానికి మందులు ఇస్తూ ప్రత్యక్షంగా, ఉత్పత్తి పరిశోధనలలో పరోక్షంగా రోగులకు ఫార్మసిస్ట్ లు చేస్తున్న కృషి చాలా గొప్పదని డాక్టర్ రాపోలు సత్యనారాయణ తెలిపినారు.  జాతీయ ఫార్మసీ వరోతవం 16-22 నవంబర్ 2020 వరకు నిర్వహిస్తున్నారు.కొవిడ్ 19 పోరులో వీరమరణం పొందిన ఫార్మసిస్ట్ లు ఎందరో. ఫార్మసిస్ట్ లు ఔషధ ప్రయోక్త లు. ఔషధం లేనిది చికిత్స లేదు. ఔషధ పరిశోధన, ఆవిష్కరణ, ఉత్పత్తి, పంపిణి, నిలువ, వితరణ, పర్యవేక్షణ, గుణదోష నిర్ధారణ వంటి అన్ని దశలు ఫార్మసిస్ట్ ల పరిధిలోని అంశాలు. భారతదేశంలో 11.25 లక్షల ఫార్మసిస్ట్ లు నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్నరు. దేశంలోని ఫార్మసిస్ట్ లందరికి 1939లో ఏర్పడిన ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ (ఐపిఏ) ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఐ పి ఏ 1948 నుంచి ఏటా ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ (ఐపిసి) అనే భేషజీ మహాసభ ను నిర్వహిస్తున్నది. ఐ పి సి నిర్వహణలో ఐ పి ఏ తోపాటు ఇండియన్ హాస్పిటల్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ (ఐ హెచ్ పి ఏ), ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (ఐపిజిఏ), అసోసియేషన్ ఆఫ్ ఫార్మసి టీచర్స్ ఆఫ్ ఇండియా (ఏపిటిఐ), ఆల్ ఇండియా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్‌ఫెడరేషన్ (ఏఐడిసిఓసి) 2007 నుంచి ఇండియన్ ఫార్మస్యుటికల్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐపిసిఏ) గా ఏర్పడి బాధ్యత పంచుకొంటున్నయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డ్రగ్ టెక్నికల్ అడ్వైసరీ బోర్డ్ సభ్యురాలుగా ఐ పి ఏ ప్రభుత్వానికి మార్గదర్శనం చేస్తుంది. ఐపిఏ ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ (ఎఫ్ఐపి), కామన్వెల్త్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ (సిపిఏ), ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్స్ (ఎఫ్ఏపిఏ), సౌత్ ఈస్ట్ ఏసియన్ రీజినల్ ఫార్మస్యూటికల్ ఫోరం (ఎస్ పి ఎఫ్), అమేరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైంటిస్ట్స్ (ఏఏపిఎస్), నేషనల్ స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లో అంతర్భాగమైన లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవెలప్మెంట్ కౌన్సిల్ (ఎల్ ఎస్ ఎస్ ఎస్ డి సి), వర్ల్డ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అలయెన్స్ (డబ్ల్యూ హెచ్ పి ఏ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) లతో కలిసి పని చేస్తున్నది.

ప్రజలు, ప్రభుత్వాలు ఫార్మసిస్ట్ ల గురుతర సేవలను గుర్తించటానికి, ఫార్మసిస్ట్ లు తమను తాము పునరంకితం చేసికొనటానికి ఐపిఏ గత 59 ఏండ్లుగా నవంబర్ మూడవ వారాన్ని జాతీయ ఫార్మసీ సప్తాహం గా ప్రతి ఏటా ఒక నినాదం తీసికొని పాటిస్తున్నది. “ఫార్మసిస్ట్స్ : ఫ్రంట్ లైన్ హెల్త్ ప్రొఫెషనల్స్” అనేది ఈ ఏటి నినాదం. “ఔషధ ప్రయోక్తలు – ముందువరుస ఆరోగ్య వృత్తినిపుణులు” అని భావం.

ఐరోపియన్ వలసలతోనే దేశంలోనికి అలోపతి వైద్యం ప్రవేశించింది. ఫార్మసి వృత్తి బ్రిటన్ లో అపోతెకరీ నుంచి, కెమిస్ట్ డ్రగిస్ట్ వంటి దశలను దాటి ఫార్మసిస్ట్ గా పరిణమించింది. వాటి ప్రతిఫలనం మన దేశంలో కూడా కనిపిస్తది. దేశంలో మొదటి అలోపతి జెనరల్ హాస్పిటల్ 1664లో మద్రాస్ లో ఏర్పాటు కాగా, మొదటి కమ్యూనిటి ఫార్మసి 1811లో కోల్‌కతాలో ప్రారంభం అయింది. ఆసియా లోనే తొలి ఫార్మసి కళాశాల మన గోవా లోని పంజింలో 1842లో పోర్చుగీస్ ప్రభుత్వం వారిచే ప్రారంభమైంది. బ్రిటిష్ ఇండియాలో మొదటి కెమిస్ట్ & డ్రగిస్ట్ డిప్లొమా 1874లో మద్రాస్ లో ప్రారంభించగా, కాంపౌండర్ శిక్షణ 1881లో బెంగాల్ లో మొదలైంది. దేశీయ ఉత్పత్తి కోసం కోల్‌కతా లో 1901 లో ప్రారంభమైన బెంగాల్ కెమికల్స్ & ఫార్మస్యూటికల్స్, బరోడాలో 1907లో ఏర్పాటు చేసిన అలెంబిక్ కెమికల్స్ లిమిటెడ్ నేటికీ కొనసాగుతున్నయి. డిప్లొమా ఇన్ ఫార్మసి కళాశాల 1920లో జల్పాయిగుడి లో ప్రారంభమైంది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 1937 సంవత్సరం నుంచి బాచెలర్ ఆఫ్ ఫార్మసీ గా డిగ్రీ స్థాయిలో ప్రవేశించింది. అదే విశ్వవిద్యాలయం 1940లో ఎం ఫార్మ్, 1945లో పిహెచ్ డి కూడా ప్రవేశపెట్టింది. ఫార్మసి కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2008లో 6 సంవత్సరాల నిడివి గల ఫార్మ్ డి కోర్స్ ప్రవేశ పెట్టింది.

భారత్ లో 3000 పై చిలుకు ఔషధ ఉత్పత్తి సంస్థలు ఉన్నయి. ప్రపంచ స్థూల ఔషధ ఉత్పత్తిలో భారత్ ది 3వ స్థానం, జెనెరిక్ ఔషధాల ఉత్పత్తిలో అగ్ర స్థానం. ప్రపంచానికి కావలసిన 20% ఔషధాలు, 62% వాక్సిన్స్, 80% ఎయిడ్స్ ఔషధాలు మనమే సమకూర్చుతున్నము. అమేరికా లో వినియోగించే 40% జెనెరిక్ ఔషధాలు, యునైటెడ్ కింగ్‌డం లో వాడే 20% ఔషధాలు మనం ఎగుమతి చేస్తున్నవే. అయినా ప్రభుత్వ రంగం ఔషధ పరిశ్రమలో, క్లినికల్ రీసర్చ్ రంగంలో వెనుకబడి ఉంది. ఫార్మసీ పరిశ్రమ బలంగా ఉన్న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ యాజమాన్యంలో ఉత్పత్తి సంస్థలు లేవు. సొంత పరిశ్రమ వల్ల ప్రభుత్వాలు ఔషధ స్వావలంబన సాధించటంతో పాటు, నాణ్యమైన పరిశోధనలు చేయవచ్చు.

1930లో ఏర్పాటు చేసిన డ్రగ్స్ ఎంక్వైరీ కమిటి సలహా మేరకు 1940లో డ్రగ్స్ యాక్ట్, 1945లో డ్రగ్ రూల్స్, 1946లో భోరే కమిటి సిఫార్స్ ల మేరకు మూడంచెల ఏకరూప ఫార్మసీ విద్య అమలు లోనికి వచ్చినయి. ఫార్మసి విద్య, వృత్తిని నియంత్రించటానికి 1948లో ఫార్మసి చట్టం వచ్చింది. అయినప్పటికీ కొన్ని శక్తులు చట్టం అమలును హాస్పిటల్ ఫార్మసి రంగంలో 1970 దశకం దాకా, కమ్యూనిటీ ఫార్మసీ రంగంలో 1989 దాకా నిలువరించ కలిగినయి. ఇప్పటికీ ఆ అమలు పాక్షికమే. తాజాగా ఫార్మసీ కౌన్సిల్ ప్రకటించిన ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ 2015 పరిస్థితి ఆ విధంగానే ఉంది. బోధనా వైద్యశాలలలో ఫార్మసి విభాగాల ఏర్పాటు జరుగ లేదు. ఇతర హాస్పిటల్ లలో పూర్తి స్థాయి నియామకాలు జరుగలేదు.  జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో ఫార్మసిస్ట్ లకు సముచిత స్థానం లేదు. వెల్‌నెస్ సెంటర్ లలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ లుగ ఫార్మసిస్ట్ లను తీసికోవాలని జాతీయ ఆరోగ్య విధానం 2017 లో పేర్కొన్నా అధికారుల పట్టింపు లేదు. తెలంగాణలోని బస్తీ దవాఖాన, ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ లో ఫార్మసిస్ట్ ల ఊసే లేదు. ఏబిసిడి లు వచ్చిన ఎవరైనా మందులు ఈయగలరన్న తప్పుడు అభిప్రాయం వల్ల ఫార్మసిస్ట్ ల ప్రాధాన్యతను తెలిసికొన లేకపోతున్నరు. కమ్యూనిటి ఫార్మసి పెట్టుకోవటానికి ఫార్మసిస్ట్ లకు ప్రోత్సాహం లేదు. ఔషధ జనిత అవాంతరాల వల్ల చాలామందికి కొత్త అనారోగ్యం, ప్రాణహాని వాటిల్లుతున్నది. ఔషధాల నిలువ, ఎంపిక, మోతాదు, ప్రయోగ మార్గం, ఇతర ఔషధాల పరస్పర చర్యలు, పథ్యం వంటి అంశాలలో మెడికల్ ప్రాక్టిషనర్ లకు దొర్లిన పొరపాట్లను సరిదిద్ద గలిగే విజ్ఞానం కలవారు ఫార్మసిస్ట్ లు మాత్రమే. అందుకే ఔషధ వితరణ ఫార్మసిస్ట్ ల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగాలని ఫార్మసీ చట్టం నిర్దేశిస్తున్నది.

 

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *