[spt-posts-ticker]

మహమ్మారిపై మూడంచెల నిఘా

అనుమానితులపై మూడు దశల్లో పర్యవేక్షణ
  నిత్యం వారితో మాట్లాడి ఆరోగ్య సమాచార సేకరణ
 

 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను కట్టడి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠ కార్యాచరణ అమలు చేస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. కరోనా అనుమానితులను గుర్తించడానికి అవకాశాలున్న అన్ని దశల్లోనూ నిఘాను తీవ్రతరం చేసింది.


అంతర్జాతీయ విమాన ప్రయాణికుల్లో కరోనా అనుమానిత లక్షణాలుంటే.. అక్కడిక్కడే గుర్తించడం తొలి అంచె.


అనుమానితులను 14 రోజులపాటు ఆసుపత్రుల్లో ఉంచి పరిశీలించడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవడం రెండో అంచె.


ఇతర దేశాల నుంచి వచ్చేవారందరినీ ఇళ్లలోనే 14 రోజుల పాటు విడి గదుల్లో ఉండేలా చర్యలు చేపట్టడం మూడో అంచె.

 

ఇలా కరోనా కట్టడికి అన్ని స్థాయుల్లోనూ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో చేపడుతున్న చర్యలను ‘ఈనాడు’తో ముఖాముఖిలో ఆయన వెల్లడించారు.


కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో కార్యాచరణ ఏమిటి?

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో మరిన్ని పడకలు, ఐసీయూలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నాం. శంషాబాద్‌ విమానాశ్రయంలో నిత్యం సుమారు 5,000 మంది అంతర్జాతీయ విమాన ప్రయాణికులను పరీక్షిస్తున్నాం. ముఖ్యంగా చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ తదితర ఏడు దేశాల నుంచి వచ్చే దేశాల వారిని.. విమానాశ్రయం నుంచే నేరుగా ఒక విడి ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడే 14 రోజుల పాటు ఉంచాలని సర్కారు తాజాగా నిర్ణయించింది.


కర్ణాటకలో తొలి కరోనా మరణం నమోదైన    నేపథ్యంలో.. రాష్ట్రంలో అప్రమత్తత ఎలా ఉంది?

కర్ణాటకకు చెందిన వ్యక్తి(72)కి హైదరాబాద్‌లో చికిత్స కోసం వారి కుటుంబ సభ్యులు కొన్ని ఆసుపత్రుల్లో సంప్రదించారు. ఒక ఆసుపత్రిలో కొంతమేరకు చికిత్స చేసి గాంధీకి వెళ్లాల్సిందిగా సూచించారు. వారు కర్ణాటకకు తిరిగి వెళ్లిపోతుండగా అతడు మృతిచెందాడు. తర్వాత అతడికి కరోనా వైరస్‌ ఉన్నట్లుగా వెల్లడవడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో అతడికి వైద్యసేవలు అందించిన వైద్యులు, నర్సులు, ఇతర సహాయక సిబ్బందిని గుర్తించాం. వారందరినీ ఇప్పటికే వారిళ్లలో విడిగా ఉండాల్సిందిగా సూచించాం. వారిని నిరంతరంగా పర్యవేక్షిస్తున్నాం.


ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా అనుమానిత కేసులను చేర్చుకుంటున్నారని కర్ణాటక వ్యక్తి కేసును పరిశీలిస్తే తెలుస్తోంది. దీన్ని ఎలా నియంత్రిస్తారు?

 

ఇటీవలే అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులతో వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ సమావేశాన్ని నిర్వహించారు. కరోనాను కట్టడి చేయడంలో మంత్రి వారి సహకారాన్ని కోరారు. ఈ వ్యాధి లక్షణాలున్నవారిని చేర్చుకోడానికి ముందు.. కచ్చితంగా వారి గత నెలరోజుల ప్రయాణ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. నమూనాలు సేకరించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రయోగశాలకే పంపించాల్సి ఉంటుంది.


రోజుకు 4-5 వేలమంది అంతర్జాతీయ ప్రయాణికులు వస్తుంటారు.. వారందరిపైనా పర్యవేక్షణ సాధ్యమేనా?

వారందరి సమాచారాన్ని కచ్చితంగా సేకరిస్తున్నాం. థర్మల్‌ స్కానింగ్‌లో జ్వర లక్షణాలుంటే వెంటనే గాంధీ, ఫీవర్‌ ఆసుపత్రులకు తరలిస్తున్నాం. ఒకవేళ ఇంటికి వెళ్లినా వారు 14 రోజుల పాటు ఇళ్లలోనే విడిగా ఉండాలని సూచిస్తున్నాం. వారి ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం తెలుసుకోవడానికి 104 కాల్‌ సెంటర్‌ను నెలకొల్పాం. ఇందులో 70 మంది మూడు షిఫ్టుల్లో సేవలందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వారికి ఫోన్‌ చేసి సమాచారాన్ని తెలుసుకుంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంటారు. సంక్షిప్త సందేశాలను పంపిస్తారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలున్నట్లు తెలిస్తే వెంటనే సమీపంలోని వైద్యసిబ్బంది హాజరవుతారు. పరీక్షించి అవసరమైతే వెంటనే కరోనా ప్రత్యేక వార్డులున్న ఆసుపత్రికి తరలిస్తారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *