[spt-posts-ticker]

సంచార’ వైద్యానికి సుస్తీ

  • సగానికిపైగా నిలిచిన వాహనాలు
  • కృష్ణా, ప్రకాశంలో అన్నిటికీ బ్రేక్‌ 
  • విశాఖలో 24కు 18 వాహనాలు నిలిపివేత
  • బీపీ, షుగర్‌ పరీక్షలు చేయకుండానే మందులు
  • 160 మంది వైద్యులు, 200 మంది నర్సుల కొరత

అమరావతి, (ఆరోగ్యజ్యోతి) : రాష్ట్రంలో సంచార చికిత్సను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆధునీకరిస్తామంటూనే సగానికిపైగా 104 వాహనాలను షెడ్‌కు పరిమితం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 293 వాహనాల్లో సగానికిపైగా మూలకు చేర్చారు. డీజిల్‌ కొట్టించలేక, చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయించలేక వాహనాలను పీహెచ్‌సీలకు పరిమితం చేశారు. కొన్ని చోట్ల ఇంజన్‌ ఆయిల్‌, టైర్లు కూడా మార్చలేని పరిస్థితిల్లో వాహనాలను నిలిపివేశారు. ఏప్రిల్‌ నాటికి కొత్తవి వస్తాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్న వాటిని పక్కన పెట్టింది. ఫలితంగా  రాష్ట్రంలోని చాలా గ్రామాలకు వైద్య సేవలు నిలిచిపోయాయి. సంచార వాహనాల రాక కోసం రోగులు, వృద్ధులు నెలలు తరబడి వేచి చూస్తున్నారు. వారికి సరైన సమయానికి మందులు అందక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

విశాఖ జిల్లా వ్యాప్తంగా 24 వాహనాలు ఉండగా 18 వాహనాలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలో 22 వాహనాలు ఉండగా ఒక్క వాహనం కూడా తిరగడం లేదు, కృష్ణా జిల్లాల్లో 20 వాహనాలకు గాను అన్నీ నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి, కడప, కర్నూలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో వాహనాలు మరమ్మతుల్లో ఉన్నాయి. నెలల తరబడి మరమ్మతులు చేయకుండా వాహనాలను పీహెచ్‌సీలకు పరిమితం చేస్తున్నారు. జిల్లాల్లో వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగానే వాహనాలు పీహెచ్‌సీలకు పరిమితం అవుతున్నాయని అంటున్నారు. గతేడాది మార్చి వరకు 104 వాహనాలు పిరామిల్‌ సంస్థ నిర్వహణలో ఉండేవి. టెండర్‌ గడువు పూర్తి కావడంతో గత ప్రభుత్వం వాటి బాధ్యతను జిల్లా వైద్యాధికారులకు అప్పగించింది. ప్రస్తుతం వాహనాల్లోకి అవసరమైన మందులు, ఇతర నిర్వహణ బాధ్యతలు మొత్తం జిల్లా వైద్యాధికారులు చూసుకోవాలి. కానీ, వైద్యాధికారులు వీటి బాధ్యతను జిల్లా మేనేజర్లు, ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌లకు అప్పగించారు. పిరామిల్‌ సంస్థ నిర్వహణలో ఉన్న సమయంలో వాహనాల మరమ్మతులు, డిజల్‌ వంటివి జిల్లా మేనేజర్లు, ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌లు చూసుకునేవారు. వాహనాలను ప్రభుత్వం సాఽ్వధీనం చేసుకున్న తర్వాత, వాళ్లు లేకపోతే మరమ్మతులు చేయించడంలో ఇబ్బందులు వస్తాయని గత ప్రభుత్వం మేనేజర్లు, ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకుంది. ప్రస్తుతం వారికి జీతాలు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ చాలా జిల్లాల్లో వీరు వాహనాల పని మానేసి సొంత పనులకే పరిమితం అవుతున్నారు. మరోవైపు వాహనాల మరమ్మతులపై జిల్లా అధికారులు, సీఎ్‌ఫడబ్యూ అధికారులు మధ్య సమన్వయం లోపం కనిపిస్తోంది.

బీపీ కూడా చూడడం లేదు

గత ప్రభుత్వంలో కాస్తో కూస్తో రోగులకు సేవలు అందించిన 104 వాహనాలు ఐదు నెలల నుంచి మెడికల్‌ షాపులుగా మారిపోయాయి. గతంలో గ్రామాల్లోకి వెళ్లి అక్కడ రోగులకు బీపీ, షుగర్‌, ఈసీజీ వంటి సేవలు అందించేవారు. ప్రస్తుతం గ్రామాల్లోకి వెళ్తున్న వాహనాల్లో కనీసం బీపీ ఆపరేటర్లు, గ్లూకోమీటర్లు, ఈసీజీ మిషన్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. గ్రామాల్లోకి వెళ్లి రోగులకు మందులు ఇచ్చి రావడం తప్ప వైద్య పరీక్షల జోలికి కూడా వెళ్లడం లేదు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 293 వాహనాల్లో విధులు నిర్వహించేందుకు సుమారు 300 మంది వైద్యులు అవసరం. కానీ, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 140 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. వాహనాల్లో 300 మంది నర్సులకు 100 మంది మాత్రమే ఉన్నారు. వైద్యులు, నర్సులతో పాటు ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నిషియన్ల కొరత కూడా ఉంది.

సీఎం, మంత్రి జిల్లాల్లో ఇలా..

మిగిలిన జిల్లాలను గాలికి వదిలేసిన అధికారులు సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి జిల్లాల్లో మాత్రం జాగ్రత్తగా వాహనాలను నడుపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ జిల్లా కడపలో 22 వాహనాలు ఉండగా ఒక్కటి మినహా అన్నీ నడుస్తున్నాయి. ఆ జిల్లాల్లో వాహనాలు మరమ్మతులకు గురైతే.. వెంటనే బాగు చేయిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 25 వాహనాలనూ నడిపిస్తున్నారు. అయితే, ఈ రెండు జిల్లాల్లోనూ సిబ్బంది కోరత, వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉంది. వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *