[spt-posts-ticker]

కరోనా అలర్ట్‌

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరి స్తుండడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక వైద్యుడిని నియమించడంతో పాటు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో అనుమానిత కేసులు ఉన్నట్లయితే ప్రజలు కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాలని వైద్యాధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో శని వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ బృంధం ప్రతినిధి శ్రావణ్‌రెడ్డి జిల్లా ఆసుపత్రిని సందర్శించి వైరస్‌ ప్రభావం, దానికి సంబంధించి ఆసుపత్రిలో  ఏర్పా ట్లను పరిశీలించారు. ఐసోలేషన్‌ వార్డులో టేబుళ్లను, ట్రేలను విడివిడిగా ఏర్పాట్లు చేయాలన్నారు. వెంటి లేటర్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం శనివారం మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

నెలాఖరు వరకు విద్యాసంస్థలు బంద్‌

రాష్ట్రంలో కరోనా కలకలం నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈ నెలాఖరు వరకు జిల్లాలోని  విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, బార్లు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో కాగజ్‌నగర్‌ పట్టణంలో ఉన్న ఏకైక సినిమాహాలుతో పాటు దాదాపు రెండు వేల వరకు పాఠశాలలు, వేసవి శిక్షణ శిబిరాలు మూసేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో అమలు చేసేందుకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా చర్యలు ప్రారంభించారు. సినిమా ప్రదర్శనలు నిలిపి వేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ద్వారా దేశాలు జారీ చేయించారు. డీఈఓల ద్వారా అన్ని రకాల యాజమాన్యాల కింద నడుస్తున్న విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

అలాగే ఫంక్షన్‌హాళ్లను మార్చి 31 తరువాత బుకింగ్‌ చేసుకోరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ముహుర్తాలు ఖరారు అయిన పెళ్లిలకు వధువు తరపున వంద మంది, వరుడి తరపున మరో వంద మంది మొత్తం 200 మందితో మాత్రమే పెళ్ళిళ్లు జరుపుకోవాలని సూచించారు. పెద్ద ఎత్తున హంగుఆర్భాటాలతో జరుపుకోకుండా సహకరించాలని కోరారు. అలాగే సభలు, సమావేశాలు,  సెమినార్లు, ఎగ్జిబిషన్లను నిర్వహించరాదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

వదంతులపై నిఘా 

వదంతులు వ్యాప్తిపై పోలీసు శాఖ దృష్టి సారించింది. ఆకతాయిలు కొందరు కంప్యూటర్‌ సాయంతో గ్రాఫిక్స్‌ ద్వారా వైరస్‌ గురించి భయంకర పోస్టులు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. దీన్ని నియంత్రించేందుకు జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. వదంతులతో ప్రజలను భయాందోళనకు గురి చేసే వారిపై నిఘా పెట్టారు. జిల్లాల్లో వైరలయ్యే అంశాలపై నిఘా పెట్టి అభ్యంతరకర పోస్టులు పెడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు. వారి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటారు.  వ్యాధి గురించి అసత్య ప్రచారాలు చేయవద్దని ప్రచారాలు నమ్మి ప్రజలు భయాందోళనకు గురవు తారని దీనిని నేరంగా పరిగణించడం జరుగుందని అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బృందాలకు రెండు రోజుల శిక్షణ ముగిసింది. వీరు క్షేత్రస్థాయిలో వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి అవ గాహన కల్పించారు. మొదటి విడతలో వైద్యాధి కారులకు అవగాహన కల్పించారు. అలాగే అన్ని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ఏరియా వైద్యశాలల్లో పని చేస్తున్న వైద్యాధికారులకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి అందే ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రచార సాధనాలు, మాధ్యమాలు ద్వారా రక్షణ చర్యలను విస్తృతంగా ప్రచారం కల్పించాలని వైద్య శాఖ నిర్ణయించింది. అలాగే శానిటైజర్లు, మాస్కుల కొరత లేకుండా చూడాలని మందుల దుకాణాల యజమానులకు ఆయా జిల్లాల డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాకుండా వైరస్‌ ప్రభావం తగ్గే వరకు జిల్లాలోని వైద్య సిబ్బంది సెలవులు ఇవ్వరాదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు.

శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి 

జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సులభ్‌ కాంప్లెక్స్‌లతో పాటు వీధుల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ప్రతి రోజు శుభ్రం చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆయా శాఖల అఽధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్ల్లాలోని మున్సిపల్‌, గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు వీధులు తిరుగుతూ చెత్త చెదారాన్ని శుభ్రం చేయాలన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని వీటిని ఆయా శాఖల అధికారులు తప్పని సరిగా పాటించాలని సూచించారు. లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ పట్ల జిల్లా అధికార యంత్రాంగం అప్రమ త్తమైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు బెడ్లతో కూడిన ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి జిల్లా నోడల్‌ అధికారిగా డాక్టర్‌ ప్రేంసాగర్‌ను నియమించారు. జిల్లా స్థాయితో పాటు పీహెచ్‌సీ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీని అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ సుధాకర్‌నాయక్‌ పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా పీహెచ్‌సీ స్థాయి కమిటీని సంబంధిత వైద్యాధికారి, సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. కరపత్రాలు ఆరోగ్య సిబ్బందితో ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు.  ఇప్పటి వరకు జిల్లాలో కరోనా వైరస్‌  అనుమానిత కేసులు నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ప్రజలు మాస్క్‌లు ధరించడంతో పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

ఐస్‌క్రీమ్‌ లాంటి చల్లని వస్తువులకు దూరంగా ఉండడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ శుభ్రమైన బట్టలు ధరించాలి.

జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం మంచిది.

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాలు తప్పనిసరిగా అడ్డు పెట్టుకోవాలి.

సబ్బుతో తరుచుగా చేతులు కడుక్కోవాలి. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *